English సబ్‌స్క్రైబ్

గోప్యతా విధానం: The Daily Bench తెలుగు యాప్

చివరి నవీకరణ: 14 నవంబర్ 2026

1. ఈ విధానం దేని గురించి

The Daily Bench తెలుగు యాప్ (ఇకపై "యాప్") సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులపై మా సంపాదకులు తెలుగులో ప్రచురించిన సారాంశాలను చూపిస్తుంది. యాప్ ఉచితం; ప్రకటనల ద్వారా నడుస్తుంది. ఈ విధానం యాప్ ఏ సమాచారాన్ని ఉపయోగిస్తుంది, ఎవరికి వెళ్తుంది, మీకు ఉన్న ఎంపికలు ఏమిటో చెబుతుంది.

నిర్వహించేవారు: The Daily Bench, thedailybench.in. సంప్రదించవలసిన చిరునామా: contact@thedailybench.in

2. మేము అడగనిది, సేకరించనిది

ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. పేరు, ఫోన్ నంబరు, ఈమెయిల్, చిరునామా వంటి వివరాలు యాప్ అడగదు.

మీ పరిచయాలు (కాంటాక్ట్స్), ఫోటోలు, కెమెరా, మైక్రోఫోన్, ఖచ్చితమైన స్థానం (జీపీఎస్) వంటి అనుమతులు యాప్ అడగదు; యాప్ వాడేటప్పుడు ఏ అనుమతి కోసమూ మిమ్మల్ని అడగదు. మా యాప్ తానుగా ప్రకటించే అనుమతి ఇంటర్నెట్ ఒక్కటే. ప్రకటనల సాధనం (విభాగం 5) తనకు అవసరమైన కొన్ని అనుమతులను తానే జోడిస్తుంది: నెట్‌వర్క్ స్థితి తెలుసుకోవడం, ప్రకటనల మొత్తం కొలత, నేపథ్యంలో చిన్న పనులు నడపడం. వీటిలో ఏదీ మిమ్మల్ని అడిగే అనుమతి కాదు.

మీరు చదివిన కథనాల చరిత్రను గానీ, మీ గురించి ఏ ప్రొఫైల్‌ను గానీ యాప్ తయారు చేయదు, ఎక్కడికీ పంపదు. సేవ్ చేసిన కథనాల జాబితా మీ ఫోన్‌లోనే ఉంటుంది. అయితే ఒక కథనం తెరిచినప్పుడు ఆ కథనాన్ని మా వెబ్‌సైట్ నుంచి తెచ్చుకోవాలి; ప్రతి వెబ్ అభ్యర్థనలాగే ఆ అభ్యర్థనలో ఏ కథనం అడిగారు, ఎప్పుడు, ఏ ఇంటర్నెట్ చిరునామా నుంచి అనే వివరాలు ఉంటాయి (విభాగం 4). మీరు చదివిన కథనాల వివరాలను యాప్ ప్రకటనదారులకు పంపదు.

యాప్‌లో మా సొంత విశ్లేషణ (అనలిటిక్స్) సాధనం గానీ, క్రాష్ నివేదికలు పంపే సాధనం గానీ లేవు.

దీని అర్థం ఏ సమాచారమూ ఎక్కడా ప్రాసెస్ కాదని కాదు: మా వెబ్‌సైట్‌ను అందించే Cloudflare (విభాగం 4), ప్రకటనలు అందించే Google (విభాగం 5) కొంత సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి.

3. మీ ఫోన్‌లోనే ఉండే సమాచారం

ఈ సమాచారం మీ ఫోన్‌లో, యాప్‌కు మాత్రమే అందుబాటులో ఉండే భాగంలో ఉంటుంది. ఇది మాకు రాదు.

మీరు సేవ్ చేసిన కథనాల జాబితా (కథనం గుర్తింపు, శీర్షిక, కోర్టు, తేదీ): "సేవ్ చేసినవి" చూపడానికి. మీరు తీసివేసే వరకు లేదా యాప్ తొలగించే వరకు ఉంటుంది. ఒక కథనాన్ని మేము ఉపసంహరించుకుంటే దాని శీర్షిక తొలగిపోయి గుర్తింపు మాత్రమే మిగులుతుంది.

ఇటీవల తెరిచిన కథనాల ప్రతులు (గరిష్ఠంగా 60): ఇంటర్నెట్ లేనప్పుడు చదవడానికి. మా సర్వర్ చివరిసారి నిర్ధారించినప్పటి నుంచి 14 రోజులు ఉంటాయి; ఉపసంహరించిన కథనం అయితే తదుపరి సమకాలీకరణలోనే తొలగిపోతుంది.

కథనాల జాబితా, ఉపసంహరణల జాబితా: యాప్ తెరవగానే జాబితా చూపడానికి. తదుపరి విజయవంతమైన నవీకరణ వరకు ఉంటాయి.

అక్షరాల పరిమాణం, రంగు ఎంపిక: మీ ఎంపిక గుర్తుంచుకోవడానికి. యాప్ తొలగించే వరకు ఉంటాయి.

ప్రకటనల సమ్మతి సమాచారం (Google నిల్వ చేస్తుంది): ప్రకటనలపై మీ ఎంపికను గుర్తుంచుకోవడానికి (విభాగం 5). Google నియమాల ప్రకారం ఉంటుంది.

ఈ సమాచారం ఫోన్ బ్యాకప్‌లోకి గానీ, కొత్త ఫోన్‌కు బదిలీలోకి గానీ వెళ్లదు (యాప్‌లో బ్యాకప్ నిలిపివేశాం). యాప్‌ను తొలగిస్తే, లేదా ఫోన్ సెట్టింగ్స్‌లో యాప్ డేటాను తుడిచేస్తే ఇవన్నీ తొలగిపోతాయి.

4. సారాంశాలు తెచ్చేటప్పుడు: మా వెబ్‌సైట్, Cloudflare

యాప్ సారాంశాలను thedailybench.in నుంచి సురక్షిత (HTTPS) కనెక్షన్ ద్వారా తెస్తుంది. యాప్ తెరిచినప్పుడు, 15 నిమిషాల తర్వాత మళ్లీ యాప్‌కు వచ్చినప్పుడు, మీరు ఒక కథనం తెరిచినప్పుడు ఇలా జరుగుతుంది.

మా వెబ్‌సైట్‌ను Cloudflare, Inc. అనే సంస్థ అందిస్తుంది (హోస్టింగ్, కంటెంట్ డెలివరీ). ప్రతి వెబ్‌సైట్‌కు జరిగినట్లే, ప్రతి అభ్యర్థనతో Cloudflare కు ఈ వివరాలు అందుతాయి: మీ పరికరం ఇంటర్నెట్ చిరునామా (IP address), అభ్యర్థించిన ఫైల్ చిరునామా (కథనం తెరిచినప్పుడు ఇది ఆ కథనాన్ని గుర్తిస్తుంది), సమయం, యాప్ పేరు ("DailyBenchTelugu/1" అనే గుర్తింపు). భద్రత, దాడుల నివారణ, సేవ నడపడం కోసం Cloudflare వీటిని తన గోప్యతా విధానం ప్రకారం ఉపయోగిస్తుంది, తన నియమాల ప్రకారం నిల్వ చేస్తుంది. ఈ అభ్యర్థనల వివరాలను మేము విడిగా నిల్వ చేయము, ఏ వ్యక్తితోనూ ముడిపెట్టము.

వెబ్‌సైట్ పేజీల్లో ఉన్న Cloudflare Web Analytics సందర్శకుల గణన యాప్‌లో పనిచేయదు: యాప్ వెబ్ పేజీలను తెరవదు, సమాచార ఫైళ్లను మాత్రమే తెస్తుంది.

5. ప్రకటనలు: Google AdMob

యాప్ ఉచితంగా ఉండేందుకు ప్రకటనలు చూపిస్తాం. వాటిని Google సంస్థకు చెందిన AdMob అందిస్తుంది. ప్రకటనలు రెండు చోట్ల మాత్రమే: కథనాల జాబితాలో 7వ కథనం తర్వాత (తర్వాత ప్రతి 8 కథనాలకు ఒకటి), కథనం చివరలో. ప్రతి ప్రకటనపై "ప్రకటన" అనే గుర్తు, Google ఇచ్చే "Ad" గుర్తు, AdChoices గుర్తు ఉంటాయి. ఇంటర్నెట్ లేనప్పుడు ప్రకటనలు చూపం.

మేము చేసిన ఎంపికలు:

వ్యక్తిగతీకరించని ప్రకటనలను (non-personalised ads) మాత్రమే అడుగుతాం: మీ గత కార్యకలాపాల ఆధారంగా ప్రకటనలు ఎంచుకోవద్దని Google ను కోరుతాం.

మీ ఫోన్ ప్రకటన గుర్తింపు సంఖ్య (Android advertising ID) ను Google చదవకుండా యాప్‌లో ఆ అనుమతిని తొలగించాం. ఆసక్తుల ఆధారంగా ప్రకటనలు చూపేందుకు ఉపయోగపడే Android ప్రైవసీ శాండ్‌బాక్స్ ఆసక్తి అంశాలు (Topics), దాని ప్రకటన గుర్తింపు అనుమతులను కూడా తొలగించాం.

పెద్దలకు మాత్రమే తగిన ప్రకటనలు రాకుండా ప్రకటనల స్థాయిని "PG" కి పరిమితం చేశాం. జూదం, మద్యం, డేటింగ్, లైంగిక విషయాలు, లైంగిక-ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, త్వరగా ధనవంతులు కావచ్చని చెప్పే పథకాలు, క్యాసినో తరహా ఆటల ప్రకటనలను AdMob లో నిరోధించాం.

మీరు చదివిన, సేవ్ చేసిన కథనాలు, అంశాలు వంటి ఏ సమాచారాన్నీ మేము Google కు పంపము. ప్రకటన అభ్యర్థనలో కథనం పేరు గానీ, అంశం గానీ, కథనం చిరునామా గానీ ఉండవు.

"వ్యక్తిగతీకరించని" అంటే ప్రకటనలు మీ గత కార్యకలాపాల ఆధారంగా ఎంచుకోరని మాత్రమే అర్థం; ఏ సమాచారమూ సేకరించరని గానీ, ప్రకటనలు అనామకం (anonymous) అని గానీ కాదు. Google సేకరించేది కింద ఉంది.

అయినా Google AdMob తానుగా సేకరించేది (Google తన డెవలపర్ పత్రాల్లో ప్రకటించినది): మీ పరికరం ఇంటర్నెట్ చిరునామా, దీని ద్వారా సుమారు ప్రాంతం (నగరం స్థాయి) తెలుస్తుంది; ప్రకటనలతో మీ చర్యలు, అంటే ఏ ప్రకటన కనిపించింది, మీరు దాన్ని నొక్కారా; యాప్ పనితీరు, లోపాల సమాచారం (diagnostics); యాప్ సెట్ గుర్తింపు (app set ID) వంటి పరికర గుర్తింపులు. ప్రకటన గుర్తింపు సంఖ్యను మేము నిలిపివేశాం.

Google ఈ సమాచారాన్ని ప్రకటనలు చూపడం, వాటి కొలత, మోసాలను గుర్తించడం, తన సేవ మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తుంది; ప్రయాణంలో ఇది సంకేతీకరణ (encryption) తో వెళ్తుంది. Google దీన్ని తన గోప్యతా విధానం ప్రకారం నిర్వహిస్తుంది: https://policies.google.com/privacy ; భాగస్వాముల యాప్‌లలో Google సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుందో: https://policies.google.com/technologies/partner-sites

వ్యక్తిగతీకరించని ప్రకటనల్లో కూడా, ఒకే ప్రకటన మళ్లీ మళ్లీ రాకుండా పరిమితి (frequency capping), మొత్తం గణాంకాలు, మోసాల నివారణ కోసం Google కొన్ని గుర్తింపులను వాడవచ్చు.

సమ్మతి: మీరున్న ప్రాంత చట్టం కోరితే (ఉదాహరణకు యూరోపియన్ ఆర్థిక ప్రాంతం, యునైటెడ్ కింగ్‌డమ్), మొదటిసారి యాప్ తెరిచినప్పుడు Google సమ్మతి ఫారం చూపిస్తుంది; మీ ఎంపిక ప్రకారమే ప్రకటనలు వస్తాయి. ఆ ఎంపికను తర్వాత మార్చుకోవడానికి సెట్టింగ్స్‌లో "ప్రకటనల గోప్యతా ఎంపికలు" కనిపిస్తుంది. సమ్మతి సమాచారం తెలియకపోతే యాప్ ప్రకటనలను అసలు అడగదు.

6. పంచుకోవడం (షేర్)

మీరు "షేర్ చేయండి" నొక్కినప్పుడు, ఫోన్ షేర్ జాబితా తెరుచుకుంటుంది. మీరు ఎంచుకున్న యాప్‌కు (ఉదాహరణకు వాట్సాప్) కథనం శీర్షిక, చిన్న ముందుమాట, మా వెబ్‌సైట్‌లోని తెలుగు పేజీ లింక్ మాత్రమే వెళ్తాయి. ఆ యాప్ తన సొంత విధానం ప్రకారం వాటిని నిర్వహిస్తుంది.

7. Google Play

యాప్‌ను Google Play నుంచి దించుకుంటారు. దించుకోవడం, నవీకరణలు, Google Play తన సేవలో భాగంగా సేకరించే యాప్ పనితీరు, క్రాష్ వివరాలు Google విధానాల ప్రకారం జరుగుతాయి. Google Play మాకు మొత్తం సంఖ్యలను (ఇన్‌స్టాల్స్, క్రాష్‌ల సంఖ్య వంటివి) చూపిస్తుంది; మిమ్మల్ని గుర్తించే వివరాలు మాకు రావు.

8. పాఠకుల వయసు

ఈ యాప్‌ను 13 ఏళ్లు పైబడిన సాధారణ పాఠకుల కోసం రూపొందించాం; చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినది కాదు. కొన్ని తీర్పుల సారాంశాల్లో నేరాలు, హింస వంటి విషయాలు ఉంటాయి. యాప్ ఎవరి వ్యక్తిగత వివరాలూ అడగదు; ప్రకటనలు వ్యక్తిగతీకరించనివి, "PG" స్థాయికి పరిమితం.

9. మీ ఎంపికలు, హక్కులు

ఫోన్‌లోని సమాచారం మొత్తం తొలగించడానికి: యాప్‌ను తొలగించండి, లేదా ఫోన్ సెట్టింగ్స్ › యాప్‌లు › The Daily Bench తెలుగు › స్టోరేజ్ › డేటా తుడిచేయండి.

సేవ్ చేసిన ఒక కథనాన్ని తీసివేయడానికి: కథనంలోని సేవ్ గుర్తును మళ్లీ నొక్కండి.

ప్రకటనల సమ్మతిని మార్చడానికి (వర్తించే ప్రాంతాల్లో): సెట్టింగ్స్ › ప్రకటనల గోప్యతా ఎంపికలు.

Google ప్రకటనల సెట్టింగ్స్: https://myadcenter.google.com

మేము మీ పేరుతో గానీ, ఖాతాతో గానీ ముడిపడిన ఏ రికార్డునూ ఉంచము; అందువల్ల మేము చూపగలిగే లేదా తొలగించగలిగే రికార్డు సాధారణంగా ఉండదు. Cloudflare (విభాగం 4), Google (విభాగం 5) వద్ద ఉన్న సమాచారం కోసం ఆ సంస్థల విధానాల ప్రకారం వారిని సంప్రదించవచ్చు; దానికి మేము సహాయం చేస్తాం. ఏ ప్రశ్నకైనా, ఫిర్యాదుకైనా: contact@thedailybench.in

10. భద్రత

యాప్ సురక్షిత (HTTPS) కనెక్షన్‌లను మాత్రమే వాడుతుంది; సాధారణ (సంకేతీకరణ లేని) కనెక్షన్లను నిరాకరిస్తుంది. మా వెబ్‌సైట్ చిరునామా తప్ప వేరే చోటు నుంచి సారాంశాలను తీసుకోదు. యాప్‌లో పాస్‌వర్డ్‌లు, రహస్య కీలు లేవు.

11. మార్పులు

ఈ విధానాన్ని మార్చినప్పుడు కొత్త తేదీతో యాప్‌లో, వెబ్‌సైట్‌లో ప్రచురిస్తాం. ప్రకటనల సంస్థను మార్చడం వంటి ముఖ్య మార్పులు యాప్‌లో స్పష్టంగా తెలియజేస్తాం.